రాశి ఫలాలు, ఆదాయం & వ్యయం

శుభకృతు నామ సంవత్సరం వశిష్ట పంచాంగం

కుంభము

ఆదాయంవ్యయంరాజపూజ్యంఅవమానం
5254

ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
శతభిషం 4 పాదాలు (గొ, స, సి, సు)
పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)

ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 2వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 3వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 9వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 1వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 12వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్‌ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.

2022 సంవత్సరం ఉద్యోగ జాతకం
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం, గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, ఆర్థికంగా, మరియు ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కుంభ రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు, శని, మరియు రాహు అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వృత్తి పరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా, మీపై అధికారులు వ్యతిరేకత కూడా మీ పై ఉంటుంది. దాని కారణంగా చేసే పనిలో గుర్తింపు రాకపోగా, పై అధికారుల నుంచి ఇంకా బాగా పని చేయాలనే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో మీకు ఇష్టం లేకపోయినా ఇంటికి దూరంగా వేరే ప్రదేశంలో పని చేయాల్సి వస్తుంది. దీని కారణంగా విశ్రాంతిని, మనశ్శాంతిని కోల్పోతారు. మీకున్న బాధ్యతల కారణంగా మీరు చేపట్టిన పనులు వదిలివేయకుండా ఉండాల్సి వస్తుంది. ఏప్రిల్ లో గురువు తో పాటుగా నాలుగు గ్రహాలు రాశులు మారటంతో మీ పరిస్థితిలో అనుకూలమైన మార్పులు వస్తాయి. మీ వృత్తిలో పదోన్నతి రావటమే కాకుండా గత కొద్ది కాలంగా పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. తిరిగి మీ కుటుంబం తో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. గురు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసిన కారణంగా గుర్తింపును, పై అధికారులు పొందుతారు. మీరు పనిచేసే చోట ఆదర్శ వంతులుగా కొనియాడబడతాడు. రాహు గోచారం మూడవ ఇంటికి మారడంతో మీలో ఉండే నిరాశా, నిస్పృహలు తొలగిపోయి, ఉత్సాహంగా మీ పని చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయం తొలగి పోతుంది. దానివలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చ గలుగుతారు. గతంలో మీ సహోద్యోగులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత వారికి విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. జూలై నుంచి శని గోచారం తిరిగి 12వ ఇంటికి రావటం వలన చేసే పనిలో ఆసక్తి తగ్గడం కానీ, బద్ధకం పెరగడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీరు బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని వీడి పని చేయడం వలన గతంలో సంపాదించిన పేరు నిలబెట్టుకో గలుగుతారు. ఈ సమయంలో కొన్నిసార్లు మీకు మంచి అవకాశాలు దగ్గరగా వచ్చి మీ నిర్లక్ష్యం కారణంగా కానీ, బద్ధకం వలన కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు చెప్పే మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, లేదా విలువ ఇవ్వకపోవడం కానీ జరగవచ్చు. అలాగే పని విషయంలో తొందరపడి మాట ఇచ్చి తర్వాత బాధ పడటం జరగవచ్చు. గురు గోచారం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ శ్రేయోభిలాషుల వలన కానీ, మీ పై అధికారుల వల్ల కానీ ఊహించని లాభాలు పొందుతారు.

2022 సంవత్సరం ఆర్థిక జాతకం
ఈ సంవత్సరం, కుంభ రాశిలో జన్మించిన వారికి, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు, శని, మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. పన్నెండవ ఇంట శని గోచారం కారణంగా ఆర్థికంగా అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉండటం, అంతేకాకుండా అనవసర ఖర్చులు ఎక్కువ అవటం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అంతేకాకుండా ఇల్లు కాని, వాహనానికి సంబంధించి కానీ మరమ్మతుల కారణంగా కూడా డబ్బు ఖర్చవుతుంది. ఈ సమయం లో వీలైనంతవరకూ ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి లేకుంటే అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. శని దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన రావలసిన డబ్బులు కానీ, డబ్బు సంపాదించే అవకాశాలు కానీ రాకపోవడం లేదా సమయానికి ఉపయోగపడక పోవటం జరగవచ్చు. ఏప్రిల్ నుంచి ప్రధాన గ్రహాల గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి లో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, రాహు గోచారం మూడవ ఇంట ఉండటం అలాగే శని దృష్టి ధన స్థానము పై ఉండకపోవడంతో ఆర్థికంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ఖర్చులు తగ్గటమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు సమయానికి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా వారసత్వ వివాదాలు కానీ, కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం డబ్బు కానీ, స్థిరాస్తులు కానీ లభిస్తాయి, మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా కూడా ఆదాయం జరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి ఆదాయం లభించడంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో ఇల్లు కాని, వాహనాలు కొనుగోలు చేస్తారు. జూలై నుంచి శని దృష్టి తిరిగి రెండవ ఇంటిపై పడటం వలన, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండటం వలన పెరిగిన ఖర్చులను తట్టుకునే ఆదాయాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు. ఈ సమయంలో డబ్బు అప్పు ఇవ్వడం కాని, గొప్పలకు పోయి విలాసాల కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ మంచిది కాదు. దానివలన ఇచ్చిన డబ్బు తిరిగి రాక పోగా ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

2022 సంవత్సరం కుటుంబ జాతకం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత గురువు గోచారం బాగా ఉంటుంది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు లేకుండా ఉంటుంది. ఏప్రిల్ వరకు ఒకటవ ఇంటిలో గురు గోచారం ఉండటం, నాలుగవ ఇంటిలో రాహు గోచారం ఉండటం, మరియు శని దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కొంతకాలం ఉద్యోగ రీత్యా కాని, ఇతర కారణాలతో ఇంటి నుంచి దూరంగా వేరే ప్రాంతంలో ఉండటం జరుగుతుంది. ఈ సమయంలో మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబ వృద్ధి జరుగుతుంది. మీ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరగటం కానీ, సంతానం కలగని వారికి సంతానం అవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ శని దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండటం కానీ, లేదా వారితో మీకు మనస్పర్థలు రావడం కాని వచ్చు. ఏప్రిల్ వరకు నాలుగవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంగా ఈ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత రాహువు మూడో ఇంటికి మారడంతో కొత్త ఇంటికి మారడం కానీ, కొత్త ప్రదేశంకు మారడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా గతంలో ఉన్న మానసిక సమస్యలు తగ్గుతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. మీ తోబుట్టువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. జూలైలో శని గోచారం తిరిగి 12వ ఇంటికి మారటం వలన కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో కోర్టు కేసులు కానీ, వారసత్వ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాట కారణంగా మీ కుటుంబ సభ్యుల మనసు నొచ్చు కోవడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం కానీ జరగవచ్చు. మీ కుటుంబంలో పెద్దవారి జోక్యంతో ఈ సమస్యలు తొందరగానే తగ్గిపోతాయి.

2022 సంవత్సరం ఆరోగ్య జాతకం
ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఆరోగ్య విషయంలో మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు శని, గురువు, మరియు రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తలకు, కాలేయానికి, మెడకు, మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం చేయడం, సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మంచిది. ఈ సమయంలో దృష్టి రెండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకలకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో లో వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు సమస్యలు మీరు ఎక్కువ శ్రమ చేయకుండా, సరైన ఆహారపు అలవాట్లు లేకుండా ఉండటం వలన వస్తాయి కాబట్టి మీ జీవన విధానాన్ని మార్చుకోవడం వలన భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏప్రిల్ నుంచి గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ ఉద్యోగం కారణంగా లేదా మీ కుటుంబం కారణంగా ఏర్పడిన మీ మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. జూలై తరువాత శని , తిరిగి పన్నెండవ ఇంటిలో సంచరించినప్పటికీ, గురు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు.

2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి
కుంభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం కలిసి రావడంతో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు, రాహువు, మరియు శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో వ్యాపారం బాగానే జరిగినప్పటికీ ఆర్థికంగా అనుకూలించక పోవడంతో డబ్బు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పెట్టిన పెట్టుబడి నుంచి సరైన రాబడి లేకపోవడంతో అప్పు చేయడం కానీ బంధుమిత్రుల నుంచి డబ్బు సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ఎంత శ్రమ చేసినప్పటికీ ఈ సమయంలో ఫలితం సామాన్యంగానే ఉంటుంది. అయితే కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో వస్తాయి. కానీ వాటి విషయంలో తొందర పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏప్రిల్ నుంచి గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారపరంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. అయితే సప్తమ స్థానంపై దృష్టి కారణంగా ఏప్రిల్ మరియు జులై మధ్యలో వ్యాపారంలో అనుకోని మార్పులు జరగడం కానీ భాగస్వాములు వెళ్లిపోవడం కానీ లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు రావడం కానీ జరుగుతుంది. దాని కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. అయితే ఈ సమయంలో లో రాహు మరియు గురు గోచారం అనుకూలంగా ఉండటంతో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సామరస్యపూర్వకంగా, మీకు అనుకూలంగా పరిష్కరించుకో గలుగుతారు. దానివలన వ్యాపారం లో జరిగే నష్టాలు ఆగిపోతాయి. గతంలో మీతో పోటీపడ్డ వారు కానీ, మీతో శత్రుత్వం కలిగి ఉన్నవారు కానీ ఈ సమయంలో మీకు దూరంగా వెళ్లి పోతారు. వారి ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నవారికి, కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. అయితే ప్రారంభంలో మీ వ్యక్తిగత సమస్యల కారణంగా కానీ, లేదా ఇతర సమస్యల వల్ల కానీ మీరు మీ పనిని సక్రమంగా నిర్వహించ లేక పోతారు. దాని కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వలన పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం మరియు రాహు గోచారం బాగుండటం వలన సమయం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించడమే కాకుండా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ప్రజల మెప్పు పొందుతారు. ఈ సమయంలో లో మీ పనిలో మీరు చూపించే నైపుణ్యం కారణంగా మరిన్ని అవకాశాలను పొందుతారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య శని గోచారం ఉండటం వలన మీరు చేపట్టిన పని కొంత ఆలస్యంగా పూర్తిచేస్తారు. దానివలన మీరు కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంది. అయితే మీ శ్రేయోభిలాషుల సహకారంతో ఈ సమస్య నుంచి బయట పడతారు. జూలై తరువాత సంవత్సరాంతం వరకు మీకు అనుకూలంగా ఉంది.

2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు
కుంభ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమంగా యోగిస్తుంది. ఏప్రిల్ వరకు గురువు, శని, మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన చదువులో సామాన్యంగా రాణిస్తారు. ఈ సమయంలో ఏకాగ్రత లోపించడమే కాకుండా చదువు విషయంలో మూర్ఖ వాదనలు చేయడం కానీ అహంకారంగా మాట్లాడటం కానీ చేస్తారు. శని గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన చదువు విషయంలో బద్ధకం గా ఉండటమే కాకుండా పెద్దవాళ్లు చదవమని చెప్పిన ప్రతి సారి ఏదో ఒక కారణం చెప్పి దాన్నుంచి తప్పించుకుంటారు. దీని తలపొగరు కారణంగా సహాయం చేద్దాం అనుకునే వారు కూడా చేయకుండా వెళ్లిపోతారు. ఏప్రిల్ నుంచి గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల చదువు విషయంలో గతంలో తాము చేసిన తప్పును గుర్తించి ఆ తప్పును సవరించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో చదువుపై ఏకాగ్రత పెరగడమే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కూడా పెరుగుతుంది. దాని కొరకు గురువులను, పెద్దవారిని సంప్రదిస్తారు. ఈ సమయంలో లో గురు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన చదువు కారణంగా గుర్తింపును కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. అయితే జూలై వరకు శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్నిసార్లు మూర్ఖంగా కూడా ప్రవర్తిస్తారు. అయితే ఇది వారి మానసిక ఒత్తిడి కారణంగా వచ్చింది కాబట్టి వెంటనే తమ తప్పును తాము గుర్తించి దానిని సరిదిద్దుకుంటారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మంచి ఫలితం ఉంటుంది. వారు అనుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకో గలుగుతారు.

2022 సంవత్సరం గ్రహదోషములు – పరిహారములు
కుంభ రాశిలో జన్మించిన వారు, ఈ సంవత్సరం, గురువుకు, శనికి, మరియు రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు జన్మ రాశిలో సంచరిస్తాడు. దాని కారణంగా ఆర్థిక సమస్యలు గానీ ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురుచరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఏప్రిల్ వరకు రాహువు నాలుగవ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయంలో రాహువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం చేయడం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పారాయణం చేయడం కానీ, లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఇవే కాకుండా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ, శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది. శని మనం చేసే కష్టానికి సంతృప్తి చెందుతాడు కాబట్టి, శారీరకంగా కష్టపడటం అంటే పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం అలాగే దానధర్మాలు చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

మరోక రాశిని ఎంచుకోండి