రాశి ఫలాలు, ఆదాయం & వ్యయం

శుభకృతు నామ సంవత్సరం వశిష్ట పంచాంగం

కన్య రాశి

ఆదాయంవ్యయంరాజపూజ్యంఅవమానం
11545

ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)

ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 7వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 8వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 2వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 6వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 5వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్‌ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.

2022 సంవత్సరం ఉద్యోగ జాతకం
కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం వృత్తి విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సంవత్సర ద్వితీయార్ధంలో గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఏప్రిల్ వరకు వృత్తి పరంగా సామాన్య అభివృద్ధి ఉంటుంది. పనిలో ఒత్తిడి ఉండటం అలాగే గుర్తింపు కొరకు ఎంత కష్టపడ్డా సరైన విధంగా గుర్తింపు రాకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా శని గోచారం కూడా మధ్యమంగా ఉండటం వలన ఈ సమయంలో చెప్పుకోదగినంత అభివృద్ధి ఉండకపోవడమే కాకుండా మీ సహోద్యోగులు నుంచి కూడా సరైన సహకారం లభించదు. రావలసిన పదోన్నతి కూడా రాకుండా వాయిదా పడటం కానీ లేదా ఆగిపోవడం కానీ జరగవచ్చు. వృత్తిలో మార్పు కోరుకున్న వారికి కూడా ఈ సమయంలో అనుకున్న విధంగా ఫలితం రాదు. ఏప్రిల్లో గురువు ఏడవ ఇంటికి మారటంతో వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో గురు మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదోన్నతి కానీ అనుకున్న ప్రదేశానికి బదిలీ కానీ అవుతుంది. అంతేకాకుండా మీ విలువ మీ సహోద్యోగులు గుర్తించడం, వారి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు అవార్డులు కానీ లేదా ప్రశంసలు కానీ లభిస్తాయి. విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అయితే రాహు గోచారం ఏప్రిల్ తర్వాత అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తాకడం కానీ, అవమానాలు ఎదురవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో అత్యాశతో కానీ, ముందు వెనుకా ఆలోచించకుండా ఎటువంటి పనులు, ముఖ్యంగా మీ శక్తికి మించిన పనులు చేయడానికి ఒప్పుకో కండి. దాని వలన ఆ పని కాకపోవడమే కాకుండా మీకు అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యాత్మక సమయాల్లో మీ మిత్రులు కానీ, సోదరులు కానీ సహాయం చేసి ఆ సమస్యను దూరం చేసే అవకాశం ఉంటుంది. జూలై తరువాత తిరిగి శని గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో మార్పు విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ వృత్తిలో మార్పు విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో ఈ విషయంలో ప్రయత్నం చేయటం మంచిది. తొందరపడి మాట ఇవ్వడం వలన తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఏప్రిల్ తర్వాత ఉద్యోగం లభిస్తుంది.

2022 సంవత్సరం కుటుంబ జాతకం
కుటుంబ విషయంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్ధంలో కుటుంబ స్థానంపై గురు దృష్టి ఉండటం అలాగే ద్వితీయార్ధంలో గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. గురు దృష్టి కారణంగా కుటుంబ వృద్ధి జరుగుతుంది. అంతేకాక కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే గురు గోచారం మధ్యమంగా ఉన్నప్పటికీ శని గోచారం సామాన్యం గా ఉండటంవల్ల ఏప్రిల్ వరకు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం దాని వలన కొంత మానసిక చింత ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా మీ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఏప్రిల్ నుంచి గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటిలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో చాలా కాలం నుంచి వివాహం కాకుండా ఎదురుచూస్తున్న వారికి వివాహ ప్రాప్తి ఉంటుంది. అలాగే సంతాన విషయంలో ఆలస్యం అయిన వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గురు గోచారం బాగున్నప్పటికీ ఏప్రిల్ నుంచి రాహు గోచారం 8 వ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న, చిన్న మనస్పర్థలు ఏర్పడటం, చెప్పుడు మాటలు కారణం ఇద్దరి మధ్యన ఆ కారణంగా గొడవలు రావడం జరగవచ్చు. అయితే ఈ సమయంలో అనవసర ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి మాట్లాడటం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తే చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ మిత్రులకు మరియు బంధువులు సహాయం వలన కూడా భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు కు వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో కానీ సంవత్సరాంతంలో కానీ ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

2022 సంవత్సరం ఆర్థిక జాతకం
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్ధంలో గురువు దృష్టి ధన స్థానం పై ఉండటం అలాగే ద్వితీయార్ధంలో లాభ స్థానం పై ఉండటం వలన ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే లాభ స్థానం శని దృష్టి ఉండటం వలన ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ వచ్చిన లాభాలను సరిగా వినియోగించుకోలేక పోవడం జరగచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. శని దృష్టి సప్తమ స్థానంపై మరియు లాభ స్థానంపై ఉండటం వలన లాభాల శాతం తగ్గే అవకాశం ఉండటం కానీ లేదా అనుకున్న సమయానికి పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది. ఏప్రిల్ తర్వాత రాహు గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన విలాసాలకు, అవసరం లేకపోయినా గొప్పలకు పోయి డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. గురు గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకొనట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు మరియు ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీ వృత్తి/వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మంచి ఆదాయం ఉంటుంది. ఇల్లు, వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇల్లు కానీ, వాహనం కానీ ఏప్రిల్ తర్వాత కొనుగోలు చేయడం మంచిది. ఏప్రిల్ వరకు గురు గోచారం మధ్యమం గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థిరాస్తులు, ఇల్లు కాని కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశ ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు అని మిమ్మల్ని ప్రలోభపెట్టే వారు కూడా ఉంటారు. వారి మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటికి లొంగకుండా సంపాదన విషయంలో మీ శ్రమను నమ్ము కోవడం మంచిది.

2022 సంవత్సరం ఆరోగ్య జాతకం
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో లో అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం మధ్యమంగా ఉండటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయితే ఇవి మిమ్మల్ని అంతగా బాధించేవి కావు కాబట్టి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. శని దృష్టి ఏడవ, మూడవ, మరియు పదకొండవ ఇళ్లపై ఉంటుంది కాబట్టి చేతులు, కాళ్లు మరియు జననేంద్రియాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో గురువు మరియు శని గోచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. రాహు గోచారం ఏప్రిల్ నుంచి సంవత్సరం అంతా ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, పైల్స్, మరియు స్పాండిలైటిస్ సంబంధ సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు వచ్చినప్పటికీ గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీటి నుంచి తొందరగానే బయట పడగలుగుతారు. అయినప్పటికీ మీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన ఈ సమస్యలు మళ్లీ, మళ్లీ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చేయడం అలాగే చిరుతిండ్లు తగ్గించడం వలన గ్యాస్టిక్ సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స లభించి తొందరగా ఆరోగ్యవంతులవుతారు.

2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి
కన్యా రాశి వారికి వ్యాపారపరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు మరియు శని గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం మందకొడిగా సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే శని దృష్టి సప్తమ స్థానంపై మరియు లాభ స్థానం పై ఉండటం వలన వ్యాపార భాగస్వాములతో చిన్న, చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా భాగస్వామ్యం వదిలి వారు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. దానివలన ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మరియు జులై మధ్యలో గురు మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార పరంగా మరియు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యాపారాలు విజయవంతంగా నడవటమే కాకుండా మీ వ్యాపారం కారణంగా నలుగురికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ఏప్రిల్ నుంచి గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన వ్యాపారంలో లాభాలు జరుగుతాయి. మీ వ్యాపారం వేర్వేరు ప్రదేశాల్లో కూడా ప్రారంభం చేస్తారు. ఏప్రిల్ నుంచి రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొత్తగా పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఇతరుల ప్రలోభాలకు లోనయి పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఎక్కువ లాభాలను ఆశించి తప్పుడు వ్యాపారాలు చేయడం మంచిది కాదు దాని వలన అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. వ్యాపార పరంగా గతంలో చేయాలనుకుని ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయిన వ్యాపారం ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు. మీ మిత్రుల ద్వారా దీనికొరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది. ఏప్రిల్ వరకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ లో గురు మీన రాశిలోకి మారిన తర్వాత మీకు చాలా అనుకూలమైన ఫలితం లభిస్తుంది. మీరు అనుకున్న విధంగా అవకాశాలు వచ్చి మీరు డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గతంలో దూరమైన అవకాశాలు తిరిగి వస్తాయి.

2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు
కన్య రాశి లో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు దృష్టి రెండవ ఇంటిపై ఉండటం తర్వాత లగ్నంపై ఉండటం వలన చదువులో రాణించడమే కాకుండా మంచి ఆసక్తిని ఏకాగ్రతను కలిగి ఉంటారు. శని గోచారం ఏప్రిల్ మరియు జూలై మధ్యలో ఆరవ ఇంటిలో ఉండటం వలన గతంలో ఉన్న బద్ధకం తొలగిపోయి చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన వారికి చదువు పట్ల ఉన్న భయాలు తొలగిపోయి మరింత శ్రద్ధగా తమ విద్యను పూర్తి చేస్తారు. ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి జూలై నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గోచారం 8వ ఇంటిలో ఉండటం వల్ల చదువులో శ్రద్ధ ఉన్నప్పటికీ పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి సులువైన మార్గాలు వెతికే ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా విలువైన సమయాన్ని వ్యర్థం చేసే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకూ మీ తెలివిని, శ్రమను నమ్ము కోవడం వలన చదువులో మరింత రాణించగలుగుతారు తప్ప సులువైన మార్గాలతో తాత్కాలిక విజయం భవిష్యత్తులో ఇబ్బంది పెడుతుందని గమనించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కేతు గోచారం రెండవ ఇంట్లో ఉండటం కొన్ని కొన్ని సార్లు పరీక్షల్లో సరైన విధంగా రాయకపోవడం వల్లగాని లేదా తెలిసిన సమాధానాలు కూడా ఇంటర్వ్యూల్లో చెప్పలేక పోవడం వల్ల కానీ కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే లగ్నం పై గురు దృష్టి కారణంగా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.

2022 సంవత్సరం గ్రహదోషములు – పరిహారములు
కన్యా రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా రాహు, కేతువులకు పరిహారక్రియలు ఆచరించడం మంచిది. ఏప్రిల్ వరకు రాహు, కేతువుల గోచారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఏప్రిల్లో రాహువు ఎనిమిదవ ఇంటికి, కేతువు రెండవ ఇంటికి మారటం వల్ల కుటుంబ పరంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మరియు ఆరోగ్య పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలకు పరిహారక్రియలు ఆచరించడం వలన ఇవి ఇచ్చే సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో సంచరించే రాహుగ్రహ దోష నివారణ కొరకు ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం కానీ, దుర్గా స్తోత్ర పారాయణం కానీ చేయటం మంచిది. ఇవి కాకుండా మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి 18000 సార్లు రాహు మంత్ర జపం చేయటం కానీ, రాహు గ్రహ శాంతి హోమం జరిపించటం కాని మంచిది. రెండవ ఇంటిలో కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు కేతు గ్రహ స్తోత్ర పారాయణం కానీ, గణపతి స్తోత్ర పారాయణం కానీ చేయటం మంచిది. ఇవే కాకుండా ఏడు వేల సార్లు కేతు మంత్రం జపం కానీ లేదా కేతు గ్రహ శాంతి హోమం కానీ చేయవచ్చు. . మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

మరోక రాశిని ఎంచుకోండి